నిట్ హాస్టల్‌లో గంజాయి

వరంగల్‌లోని ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక విద్యాలయం (నిట్) హాస్టల్‌లో గంజాయి వెలుగు చూసింది. 1.8కే హాస్టల్‌లో గంజాయి వాడుతున్నట్టు అనుమానం రావడంతో నిట్ వర్గాలు సోదాలు చేశారు. బీటెక్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల వద్ద గంజాయి దొరికినట్టు, వారి వద్ద నుంచి దానిని స్వాధీనం చేసుకున్న నిట్ వర్గాలు అన్ని హాస్టల్ రూంలను సోదాలు చేశారు.గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది..? ఎవరెవరు వాడుతున్నారు..? వంటి విషయాలను నిగ్గు తేల్చేందుకు నిట్ రిజిస్ట్రార్ గోవర్దన్‌రావు వివిధ విభాగాల డీన్లతో కమిటీ వేశారు. హాస్టల్ హెడ్‌వార్డన్, వివిధ హాస్టళ్ల వార్డెన్లతో పాటు స్టూడెంట్ డీన్ రామ్‌గోపాల్‌రెడ్డితో కూడిన కమిటీ నిట్ ప్రాంగణంలోని అన్ని హాస్టల్స్‌లో సోదాలు చేసింది. 
గతంలోనూ విద్యార్థులు హాస్టల్స్, తరగతి గదుల్లోనూ గంజాయి వినియోగించిన క్రమంలో వారిని పట్టుకొని నిట్ నిబంధనలకు అనుగుణంగా సెమిస్టర్లను రద్దు చేస్తూ శిక్షలు విధించిన దాఖలాలున్నాయి. నిట్ డైరెక్టర్ రమణారావు విదేశీ పర్యటనలో ఉన్నకారణంగా ఆయన వచ్చిన అనంతరం గంజాయి వాడుతున్నట్టు అనుమానాలున్న 12 మంది విద్యార్థులపై చర్యలు తీసుకునే అవకాశాలున్నట్టు నిట్ వర్గాలు పేర్కొన్నాయి


Popular posts